భారతదేశం హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి.. కానీ మన హిందూ సంస్కృతి, ఆనవాళ్లు భారతదేశానికే పరిమితం కాదు.. ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయని.. ఆధారాలతో సహా నిరూపించారు. వందల వేల సంవత్సరాల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచమంతటా వ్యాపించింది. ఇది మన కల్చర్, చరిత్ర గురించి చెబుతుంది. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద దేవాలయాలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను కలిగిన ఈ ఆలయాల గురించి చాలా మందికి తెలియదు. ఈ రోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం.
అంగ్కోర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయం దాదాపు 2 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అయితే ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం. దీని పాత పేరు యశోదాపూర్. ఈ ఆలయాన్ని రాజు సూర్యవర్మన్ II (క్రీ.శ. 1112 నుంచి 1153) కాలంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పేరు గాంచింది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో కూడా చేర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం కూడా. ఈ ఆలయం కంబోడియాలోని అంకోర్‌లో ఉంది. సిమ్రిప్ నగరంలో మెకాంగ్ నది ఒడ్డున అంగ్కోర్ ఉంది. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 30 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయ నిర్మాణం మన భారత దేశంలోని తమిళనాడులో ఉన్న దేవాలయ ఆర్కిటెక్చర్‌ను పోలి ఉంటుందట. ప్రపంచంలోని అన్ని ఆలయాలకు భిన్నంగా అంగ్‌కోర్ వాట్ ఆలయం పశ్చిమ ముఖ ద్వారాన్ని కలిగి ఉండటం విశేషం. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
భారతదేశం వెలుపల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆలయం అమెరికాలో ఉందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే! ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం USAలోని న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో నిర్మించారు. వివరాల్లోకి వెళితే.. మహంత్ స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో స్వామినారాయణ్ అక్షర్ ధామ్ మహా మందిర నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ఈ మందిర నిర్మాణం 2023లో పూర్తయ్యింది.. అయితే ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. 120 ఎకరాల్లో మందిరాన్ని నిర్మించారు. ఈ హిందూ ఆలయ నిర్మాణంలో దాదాపు 12 వేల మంది పాల్గొన్నారు. అయితే ఆలయ నిర్మాణం పురాతన హిందూ గ్రంధాల ప్రకారం జరిగింది. ఈ అక్షర్ ధామ్ మహా ఆలయంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, 9 శిఖరాలు, 9 పిరమిడ్ లు ఉన్నాయి. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా అద్భుతంగా నిర్మించారు. ప్రపంచంలోని అతి పెద్ద హిందూ ఆలయాల్లో ఒకటిగా ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం నిలిచింది. ఇది అమెరికాలోని అక్షర ధామ్ మహా మందిరం తరవాత అతి పెద్ద ఆలయంగా నిలిచింది. దీన్ని 100 ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది.
ఇక దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో 1,01,171 చదరపు మీటర్లలో అన్నామలై ఆలయాన్ని నిర్మించారు. పరమేశ్వరుడు కొలువై ఉండే ఈ ఆలయంలో పంచ భూతాల్లో అగ్నికి మూలంగా త్రినేత్రుడు సాక్షాత్కరిస్తున్నాడు. భారతదేశంలోని అతి పెద్ద హిందూ దేవాలయాల్లో ఇదీ ఒకటి. ఇక ఇదే తమిళనాడులోని తంజావూర్ లోని బృహదీశ్వర ఆలయం అతి పెద్ద, పురాతనమైన ఆలయంగా పేరు గాంచింది. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిది. ఇలాంటి ఆకృతిలో నిర్మించిన మొదటి ఆలయం కూడా ఇదే కావడం విశేషం. గ్రైనేట్ రాళ్లతో దీన్ని నిర్మించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో దీన్ని గుర్తించింది. పరమేశ్వరుడికి ప్రతిరూపమైన ఈ ఆలయంలో… త్రినేత్రుడు భారీ శివలింగాకృతిలో కొలువుదీరుతాడు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జంబుకేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఇది సుందరమైన ప్రదేశంలో ఉన్న అన్ని దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది సుమారు 1800 సంవత్సరాల క్రితం హిందూ చోళ రాజవంశానికి చెందిన కొకెంగనన్ రాజుచే నిర్మించబడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. హిందూ విశ్వాసం ప్రకారం, ఈ శివాలయం నీటి మూలకాన్ని సూచిస్తుంది. దీంతో ఈ ఆలయ ప్రాంగణంలో ఎప్పుడూ తేమ ఉంటుంది. కావేరీ నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుడిని పూజించడం విశేష ఫలాన్నిస్తుందని క్షేత్రమహత్య చెబుతుంది.
తమిళనాడులోని కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం…అతి పురాతనమైనది. ప్రపంచంలోనే ఇది కూడా అతిపెద్ద ఆలయాల్లో చోటు దక్కించుకుంది. ఆరో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడిని దర్శించుకోవచ్చు. ఈ దేవాలయం పంచ భూతాలలో భూమికి ప్రతిరూపం. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు ఉంటుంది. ఆలయ లోపలి మండపంలో వేయి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ఉన్న 3,500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు యొక్క నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచికరమైన పళ్ళను కలిగి ఉంటాయి.
ప్రపంచంలోని అతి పెద్ద హిందూ ఆలయాల్లో నేలయపర్ స్వామి ఆలయం ఒకటి. దీన్ని తమిళనాడులో 71 వేల చదరపు మీటర్లలో నిర్మించారు. భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. తమిళనాడు చిదంబరంలోని తిలై నజరాజ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు. 1,06,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం… దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శ్రీమహావిష్ణువు రంగనాథస్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద దేవాలయం. ఇందులో 1000 సంవత్సరాల నాటి మమ్మీ ఉందని ప్రచారం.