గణపతి బప్పా ‘మోరియా’ అంటే ఏమిటి? అలా ఎందుకు పిలుస్తారు?

గణపతి బప్పా ‘మోరియా’ అంటే ఏమిటి… అలా ఎందుకు పిలుస్తారు..ఈ నినాదం ఎలా ఎక్కడ మొదలైంది 

వినాయక చవితి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వాడవాడకు, వీధి వీధికి గణపతి మండపాలను ఏర్పాటు చేసి ఘనంగా అలంకరిస్తారు. వినాయకుణ్ణి ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో నవరాత్రులు పూజలు చేస్తారు. ఈ తొమ్మిది రోజులు గణేష్ నామస్మరణతో మునిగిపోయి ఉంటారు. నవరాత్రులు పూర్తయ్యాక ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తూ, నృత్యాలు చేస్తూ గంగమ్మ ఒడిలో గణపతి విసర్జన చేస్తారు. అయితే అసలు ‘గణపతి బప్పా మోరియా’ అనే పదం వెనక అర్ధం ఏమిటి? అలా ఎందుకు అంటారు? అనే సందేహం మీలో చాలామందికి వచ్చి ఉండొచ్చు. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

మన పురాణాల ప్రకారం మనం చేసే ప్రతీ పని వెనుక ఒక కారణం ఉంటుంది. అలాగే మనం మాట్లాడే ప్రతీ మాట వెనుక, పిలుపు వెనుక కూడా ఒక కథ ఉంటుందనేది నమ్మలేని నిజం. అలా “గణపతి బప్పా మోరియా” అనే నినాదం వెనుక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కధలు దాగి ఉన్నాయి. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే అసలు ‘మొరియా’ అనే పదానికి అర్ధం ఎవరికీ తెలీదు. కానీ ఏళ్ల నుంచి వస్తున్న నినాదం కాబట్టి స్మరిస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు తెలుసుకుందాం.

దాదాపు 600 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. 15వ శతాబ్దంకు చెందిన మోరియా గోసాని మహారాష్ట్రలోని పుణెకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఇతను ఒక సాధువు. గణేశుని పరమ భక్తుడు. ఆ సిద్ధివినాయకుణ్ణి పూజించడానికి తన గ్రామం నుంచి ‘మోర్ గావ్’ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓరోజు సాధువు కలలోకి గణపతి వచ్చి తన విగ్రహం దగ్గరలో ఉన్న నదిలో ఉందని, దాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. మెలుకువ వచ్చాక మోరియా గోసాని నిజంగానే నదిలోకి దిగి గాలించగా విగ్రహం తనకు లభించడంతో గణపతి తనకు స్వయం దర్శనమిచ్చారని సంతోషించాడు.

ఇక ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పడి అందరికి తెలియడంతో అక్కడకు తండోపతండాలుగా భక్తులు చేరుకొని “మోరియా గోసాని ఎంత గొప్ప భక్తుడో !! సాక్షాత్తు వినాయకుడే స్వయం దర్శనం ఇచ్చాడు” అనుకుంటూ గణపతి బప్పా మోరియా” అని గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అలా తమకు దొరికిన గణేశుని విగ్రహానికి పూజలు చేయడం స్టార్ట్ చేసారు. అప్పటి నుంచి భక్తులు గణపతితో పాటు మోరియా గోసానిని గుర్తుచేసుకుంటూ “గణపతి బప్పా మోరియా” అని పిలవడం మొదలుపెట్టారు.

పురాణాల ప్రకారం గణపతి బప్పా మోరియా నినాదం వెనుక మరో కథ కూడా ఉంది. మహారాష్ట్రలోని పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో భారమతి తాలూకాలో ఉంది. అప్పట్లో గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే మహారాజు పాలించేవాడు. అతనికి సంతానం కలగలేదు. దీంతో అతడి భార్య తపస్సు చేసి సూర్యుడి అనుగ్రహం వల్ల గర్భవతి అయ్యింది. అయితే పిల్లాడు జన్మించాక అతన్ని సముద్రంలో పడేస్తారు. అయితే ఆ పిల్లవాడు పెద్దవాడై సుదీర్ఘకాలం సూర్యోపాసకుడిగా ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సు ఫలించి సూర్యుడు అమృతాన్ని ప్రసాదిస్తాడు. మృత్యువు లేదన్న ధైర్యంతో సింధురాసుడు ముల్లోకాలను జయించాలని అనుకుంటాడు.

సమయం చూసుకుని సింధు కైలాసం, వైకుంఠాలపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం దగ్గర తలదాచుకున్నారు. దేవగురువైన బృహస్పతి ఈ సమస్యను పరిశీలించి గణపతిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి మాటలు విన్న గణేశుడు పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని హతమొందిస్తానని వాగ్దానం చేసాడట. సింధూరసుడి స్నేహితుడైన కమలాసురుడు ఒకరోజు మహాశివునిపై దండయాత్రకు వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనం తో వెళ్లి అతనితో యుద్ధం చేసాడట.

అప్పుడు సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు అతడి కడుపులో ఉన్న అమృతం బయటకొచ్చి సింధూరాసుడు మరణిస్తాడు. ఇక ముల్లోకాలు దేవతలు సంతోషంతో గణపతిని పూజించడం మొదలుపెడతారు. అప్పటి నుంచి ‘మోర్గాం’ ప్రాంతం గణపతి పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటున్నారు. ‘మోర్‌’ అంటే నెమలి. నెమలి రథంతో యుద్ధానికి వచ్చి సిందూరాసురుడిని వధించినందున ఆ ప్రాంతాన్ని మోర్గం అంటారు.. అక్కడి గణపతి క్షేత్రంలో భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేస్తారు. అది కాలక్రమేణా ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధిగాంచింది.

Related Post