వినాయకచవితి పండుగను జరుపుకునేందుకు భారతదేశమంతా సిద్దమయ్యింది. పదకొండు రోజులు ఎంతో భక్తి శ్రద్దలతో అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగను సంప్రదాయాలతో పాటు సామాజిక బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న వీధుల మొదలు పెద్ద సెంటర్లలో గణేషుడిని కళాత్మకంగా, మండపాలను భారీ డెకరేషన్లతో తీర్చిదిద్ది కొలువుదీరుతారు. అయితే ఈ పదకొండు రోజులు భక్తులు పూజలు, భక్తి కీర్తనలతో స్మరించి 11వ రోజు గణేషుడిని నిమ్మజ్జనం చేస్తారు. అసలు కథంతా అప్పుడే మొదలవుతుంది! ఇప్పుడు మనం జరుపుకునే గణేష్ వేడుకలు ఒకప్పటిలా లేవు. అప్పటిలాగా మట్టి విగ్రహాలు లేవు. పూజలు, భక్తి కీర్తనలు లేవు. ఎంతసేపు వీధి, వాడ వినిపించేలా డీజే పాటలు పెట్టి చిందులు వెయ్యడం ఆనవాయితీగా మారింది. కాలం మారింది. ప్రస్తుతం దేవుడంటే భక్తి మాత్రమే కాదు ప్రకృతి అంటే చులకన! అవునన్నా కాదన్నా ఇదే నిజం అనిపిస్తుంది. గణేష్ ఉత్సవాల్లో కనువిందు చేసే గణనాధుని విగ్రహాలు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో రూపొందిస్తురూ. అవి ప్రకృతికి మనకు ఎంత హానికరమో అన్న విషయాన్నీ మర్చిపోతున్నారు. మా వీధిలో వినాయకుడు గొప్ప అంటే కాదు మా వీధిలో గణనాధుడే అంటూ కంపిటీషన్ ను లో పడి కాలుష్యానికి కారణమవుతున్నారు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందు అసలు వినాయకచవితి 11 రోజుల సంబరాల ఆచారాలు ఎక్కడ ఎలా మొదలయ్యాయి అనేది తెలుసుకోవాలి.

1890 వ సంవత్సరంలో స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్ని ఒకేదగ్గరకి ఎలా చేర్చాలి అని ఆలోచనలో తిలక్ అందరూ కలిసి గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం ఉత్తమమైన మార్గమని ఆయన భావించారట. ఆ సమయంలో ఆయనకి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ వెనకడుగు వేయలేదు. అప్పుడే మొదటిసారి మహారాష్ట్రలో పీష్వాలు గణపతిని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇళ్లలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో గణపతి ఉత్సవాలు ఎందుకు జరపకూడదన్న తిలక్ ఆలోచనల్లోంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక 1893 లో ఈ సంబరాలు మొదలయ్యాయి. మండపాలలో గణేశుడి విగ్రహ ప్రతిష్ట, డెకరేషన్, పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా తిలక్ గుర్తింపు పొందారు. 10వ రోజున భారీ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించారని చెబుతారు. అలా గణేశ్ ఉత్సవం అప్పట్లో అలజడిని సృష్టించింది. బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడటానికి ఈ వేడుక ఎంతగానో ఉపయోగపడింది. ఎలాంటి కులమత బేధాలు లేకుండా ప్రజలందరినీ ఒకే చోటకు చేర్చి అందరిలో దేశభక్తిని రగిలించింది.

విగ్రహ ప్రతిష్ట..

ఇప్పుడు మనం గణేశుడి విగ్రహ తయారీ, 11 రోజుల ఉత్సవాల గురించి మాట్లాడుకునే అవసరం చాలా ఉంది. కాలం గడుస్తున్నా కొద్దీ ప్రకృతికి హాని కలిగిస్తున్నారన్న విషయం మర్చిపోతున్నాం. ఇప్పటికే పర్యావరణవేత్తలు పర్యావరణం ప్రమాదస్థాయికి చేరిందని హెచ్చరిస్తున్నారు. కేవలం మన సరద సంతోషాల కోసం పక్క వీధిలో ప్రతిష్టించిన విగ్రహం కంటే ఎత్తులో పెద్దది, కనువిందు కలిగించేలా వెరైటీగా ఉండేదాన్ని ప్రతిష్ఠిస్తున్నాం అంటూ పోటీపడతారే కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ విగ్రహాల నిమజ్జనం తరవాత ఆ కుంటలు, చెరువులు ఎంతగా ప్రకృతికి హాని చేస్తాయనేది మాత్రం ఆలోచించరు. ఇందులో షాకయ్యే విషయమేంటంటే చదువుకున్న వాళ్ళే ప్రకృతికి హాని కలిగిస్తున్నారు.

చదువుకున్న వారు, పర్యావరణంపై అవగాహన ఉన్నవారూ ఈ విషయాన్ని గమనించకపోవడం బాధాకరం. దేశంలో పలు చోట్ల ఎతైన విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. కానీ నిమజ్జనం అనంతరం విగ్రహాలు నీటిలో కరిగి దాని నుంచి వచ్చే వ్యర్ధాలతో ఆ చెరువులు మొత్తం కలుషితం కావడం దారుణం! ఇక అందులో జీవనం ఏర్పరుచుకున్న జలవనరులు, ఆ నీటిని తాగేందుకు వచ్చే పక్షులు.. ఆ నీటి మీద డిపెండ్ అయ్యే జీవుల మనుగడ పరిస్థితి ఎలా మారుతుందో గమనించరు. ఇక మన భాగ్యనగరంలో ప్రతీ ఏటా దాదాపు 60 వేల విగ్రహాలను ప్రతిష్టిస్తారు. వీటిలో ప్లాస్టర్ పారిస్ విగ్రహాల సంఖ్యే ఎక్కువ. అందుకే నిమజ్జనం కంటే చెరువుల్లో వ్యర్ధాలను వెలికి తీయడమే పెద్ద పని. నిమజ్జనం సమయంలో విగ్రహాలతో పాటు పూజ సామాగ్రిని కూడా చెరువులోని వేస్తారు భక్తులు. ప్రతీ ఏడాది చెరువుల్లో వ్యర్ధాల సంఖ్య పెరుగుతూనే ఉంది అని అధికారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణాన్ని నాశనం చేయడంతో పాటు నిమజ్జనం తర్వాత ఆ నీటిని పూర్తిగా కలుషితం చేస్తాయి. ఆ నీటి వల్ల శ్వాసకోస సంబంధిత సమస్యలు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో పాటు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

పర్యావరణాన్ని పెంపొందించడానికి ఓవైపు మొక్కలు నాటుతుంటే అవే మొక్కలను కర్రెంట్ తీగలకు అడ్డొస్తున్నాయని తొలగిస్తున్నారు. మరి అంతకంటే ఎక్కువ నష్టాన్ని, ప్రమాదాన్ని సృష్టించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేదించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించడం బాధాకరం.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఇలా..

వాస్తవానికి.. ప్రతి పండుగ వెనుక ఓ గొప్ప లక్ష్యం దాగి ఉంటుంది. ప్రకృతికి కట్టుబడి, నేల-నీరు, చెట్టు-మొక్క మొదలైన ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఇది మన భారతీయ సంస్కృతిలో గొప్పదనం. అందుకే వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యాన్ని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణానికి ప్రాధాన్యత ఇద్దాం. మట్టి వినాయకుణ్ణి పూజించి, మండపాల డెకరేషన్లలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నిమజ్జనం తరవాత చెరువుల్లో, కుంటల్లో ప్లాస్టిక్ లేదా వ్యర్ధాలతో కలుషితం చేయకుండా ఆపాలి. ప్రజల్లో ఈ పీఓపీ విగ్రహాల వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ కలిగించాలి. ప్రకృతిని నాశనం చేసే ప్లాస్టిక్, థర్మాకోల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

Related Post